KA Paul: వైసీపీ నేతలకు వారం రోజులు టైమ్ ఇస్తున్నా..: కేఏ పాల్
- విశాఖలో క్రైస్తవుల భూములు కబ్జా చేశారని కేఏ పాల్ మండిపాటు
- ఈ భూముల విలువ రూ. 550 కోట్లు ఉంటుందన్న పాల్
- వారం రోజుల్లో భూములు వెనక్కి ఇచ్చేయాలని హెచ్చరిక
విశాఖలో క్రైస్తవులకు చెందిన విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన మనసు మార్చుకుని ఆ భూములను బాప్టిస్ట్ సంఘాలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విలువ రూ. 550 కోట్లకు పైగా ఉందని చెప్పారు. ఈ భూములను ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారని అన్నారు. ఈ భూముల్లో చట్ట విరుద్ధంగా బిల్డింగులు కడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ అండదండలతోనే ఈ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
తన సత్తా ఏంటో వైసీపీ నేతలకు తెలియదని.... వాళ్లకు 7 రోజుల సమయం ఇస్తున్నానని... ఈలోగా క్రిస్టియన్ ల్యాండ్స్ తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మీదే కేసులు వేసి గెలిచానని... భూములు తిరిగి ఇవ్వకపోతే మీ మీద కూడా కేసులు పెడతానని అన్నారు.
వరంగల్ లో ఎంపీ అభ్యర్థిగా బాబూ మోహన్ ను పెడితే కేసీఆర్ కు, కాంగ్రెస్ నాయకులకు వణుకు పుడుతోందని పాల్ చెప్పారు. బొత్స సత్యనారాయణ దంపతులు విజయనగరంలో అనేక కబ్జాలు చేశారని విమర్శించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూముల్లో కేఏ పాల్, బాబూ మోహన్ ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.