Satyendar Jain: సుఖేశ్ ఆరోపణల ఎఫెక్ట్... ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పై సీబీఐ దర్యాప్తు
- గతంలో ఢిల్లీ జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్
- జైల్లో సౌకర్యాల పేరుతో జైన్ తన నుంచి రూ.10 కోట్లు తీసుకున్నారని సుఖేశ్ ఆరోపణ
- ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న జైన్
- గవర్నర్ సిఫారసు మేరకు సీబీఐ దర్యాప్తునకు కేంద్రం అనుమతి
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి గత కొంత కాలంగా తీహార్ జైల్లో ఉన్న ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఎదుర్కోబోతున్నారు. సత్యేంద్ర జైన్ పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సత్యేంద్ర జైన్ గతంలో ఢిల్లీ ప్రభుత్వంలో జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో, ఘరానా ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కు జైల్లో సౌకర్యాలు కల్పించేందుకు రూ.10 కోట్లు తీసుకున్నారన్నది సత్యేంద్ర జైన్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. సుఖేశ్ చంద్రశేఖర్ స్వయంగా ఈ ఆరోపణలు చేశాడు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు.
దీంతో, అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్ర జైన్ పై సీబీఐ దర్యాప్తును కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గత నెలలో సిఫారసు చేశారు. గవర్నర్ సిఫారసు నేపథ్యంలో, సత్యేంద్ర జైన్ పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం తాజాగా అనుమతి మంజూరు చేసింది.