Vijay Deverakonda: ప్రేమ వివాహ‌మే చేసుకుంటా.. నా త‌ల్లిదండ్రుల‌కు ఆ అమ్మాయి త‌ప్ప‌క న‌చ్చాలి: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda Sensational Comments on His Marriage

  • ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా 'ఫ్యామిలీ స్టార్' చిత్ర‌ బృందం
  • త‌మిళ‌నాడులో ప్రెస్‌మీట్.. త‌న పెళ్లి, మూవీల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న విజయ్  
  • ఏప్రిల్ 5వ తేదీన థియేట‌ర్ల‌లోకి ఫ్యామిలీ స్టార్
  • మొద‌ట తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌.. రెండు వారాల త‌ర్వాత హిందీ, మ‌ల‌యాళంలో రిలీజ్  
  • ఇటీవ‌ల సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్‌'కు యూ/ఏ స‌ర్టిఫికేట్

ఫ్యామిలీ స్టార్ విడుద‌ల‌కు ఇంకా వారం రోజులే మిగిలి ఉండ‌డంతో చిత్ర బృందం  ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది. గురువారం తిరుప‌తిలో గ్రాండ్‌గా చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించిన మూవీ టీమ్.. తాజాగా త‌మిళ‌నాడులో ఓ ప్రెస్‌మీట్ నిర్వ‌హించింది. ఈ మీడియా స‌మావేశంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొంద‌ త‌న త‌ర్వాతి సినిమా విశేషాలు, పెళ్లి ముచ్చ‌ట్లు పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయన త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

విజ‌య్ మాట్లాడుతూ.. "నాక్కూడా పెళ్లి చేసుకోవాల‌ని, తండ్రి కావాల‌ని ఉంది. కానీ ఇప్పుడే చేసుకోను. త‌ప్ప‌కుండా ప్రేమ పెళ్లే చేసుకుంటా. నా త‌ల్లిదండ్రుల‌కు నేను చేసుకోబోయే అమ్మాయి త‌ప్ప‌క న‌చ్చాలి. ఇక నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొంత‌మంది త‌మిళ ద‌ర్శ‌కులు నాకు స్టోరీలు చెప్పారు. అందులో కొన్ని నాకు బాగా న‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ అవుతాయని అనుకుంటున్నా. అలాగే గౌత‌మ్ తిన్న‌నూరితో నేను చేయ‌బోయే సినిమాలో చాలామంది కోలీవుడ్ న‌టీన‌టులు భాగం కానున్నారు. 

ఇక ఫ్యామిలీ స్టార్ చిత్రం యూనివర్స‌ల్ కంటెంట్‌తో తీర్చిదిద్ద‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ఏప్రిల్ 5న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాం. రెండు వారాల త‌ర్వాత హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం. ఒక్క త‌మిళ‌నాడులోనే 250 థియేట‌ర్ల‌లో మూవీ విడుద‌ల అవుతుంది. ఇటీవ‌ల సెన్సార్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్‌కు యూ/ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. అలాగే సినిమా నిడివి 2.40 గంట‌లు ఉంటుంది. ఎమోష‌న్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ ఈ చిత్రంలో చాలా బాగా కుదిరాయి. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం" అని విజ‌య్  చెప్పుకొచ్చాడు.

కాగా, ఏప్రిల్ 5న విడుద‌ల‌వుతున్న ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట‌ర్ ప‌రశురామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంతకుముందు గీత గోవిందం లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాంబోలో ఫ్యామిలీ స్టార్‌ వ‌స్తుండ‌డంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని  నిర్మించారు. అలాగే గీత గోవిందం త‌ర్వాత ఈ మూవీకి కూడా గోపి సుంద‌రే సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై భారీగా అంచ‌నాలు పెంచేశాయి.

More Telugu News