Medak District: నా అనుభవం మిగతావారి కంటే బాగా పని చేసే శక్తిని ఇస్తుంది: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
- తన గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీశ్ రావు తీసుకున్నారన్న అభ్యర్థి
- ఈ ప్రాంతంలో... ప్రతి కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తినని వెల్లడి
- నేను మీ మనిషినని నమ్మండి... భారీ మెజార్టీతో గెలిపించండని విజ్ఞప్తి
తనకు ఈ ప్రాంతంలో కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉందని... ఇక్కడి సమస్యలపై అవగాహన ఉందని... తన అనుభవం మిగతా వారికంటే మీకోసం బాగా పని చేసే శక్తిని... అవకాశాన్ని ఇస్తుందని మెదక్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... తన గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీసుకున్నారన్నారు. ఈ ప్రాంతంలో తాను అధికారిగా పని చేసినందువల్ల ప్రతి కుటుంబానికి... ప్రతి గ్రామానికి పరిచయం ఉన్న వ్యక్తినని చెప్పారు. 11 ఏళ్లు మీతో కలిసి పని చేశానని... మీ ఇంటి కోసం... మీ గ్రామం కోసం పని చేశానన్నారు. ప్రభుత్వాల సహకారంతో సిద్దిపేట జిల్లాను తాను భారతదేశ పటంలో నిలిపానన్నారు.
జాయింట్ కలెక్టర్‌గా... కలెక్టర్‌గా మీ మన్ననలు పొందానని... ఈసారి తనకు ఎంపీగా అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉందని... ఈ ప్రాంతంపై తనకు పూర్తిస్థాయిలో పట్టు ఉందని... కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. మిగతా వారి కంటే మంచిగా పని చేయడానికి తన అనుభవం ఉపయోగపడుతుందని, ఈ ప్రాంతవాసిగా తనకు సమస్యలు అన్నీ తెలుసునన్నారు.
తాను కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా అధికారాన్ని బాధ్యతగా భావించాను తప్ప హక్కుగా భావించలేదన్నారు. తాను కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలతో నిత్యం కలెక్టరేట్ కళకళలాడేదన్నారు. 'నేను మీ మనిషిని అని నమ్మండి... భారీ మెజార్టీతో గెలిపించండి' అని ఆయన విజ్ఞప్తి చేశారు. దుబ్బాకకు చెందిన ఇద్దరు అమ్మాయిలను తాను చదివించానని గుర్తు చేసుకున్నారు. వెంకట్రామిరెడ్డిగా మాట ఇస్తున్నానని... తాను ఎంపీగా గెలిచిన నెల రోజుల్లో రూ.100 కోట్లతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత చదువు, ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తానని చెప్పారు. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు బాగా సంపాదించారని, కాబట్టి తన వద్ద డబ్బు ఉందని చెప్పారు.