Bhagwant Singh Mann: మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
![Punjab CM Bhagwant Singh Mann wife Gurpreet blessed with Baby Girl](https://imgd.ap7am.com/thumbnail/cr-20240328tn66055c541fc6e.jpg)
- పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సీఎం భార్య గురుప్రీత్ కౌర్
- దేవుడు తనకు కుమార్తెను బహుమతిగా ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేసిన భగవంత్ మాన్
- గురుప్రీత్ కౌర్‌ను 2022 జులైలో పెళ్లాడిన పంజాబ్ సీఎం
- అంతకుముందు మొదటి భార్య ఇంద్రపీత్ కౌర్, భగవంత్ సింగ్ మాన్‌కు ఇద్దరు పిల్లలు
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మూడో బిడ్డకు తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ గురువారం మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సీఎం తన ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతా ద్వారా తెలియజేశారు. 'దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు' అని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. దీనికి చిన్నారి ఫొటోను కూడా జత చేశారు. ఈ శుభవార్త తెలుసుకున్న ఆప్ కార్యకర్తలు, నేతలు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ 2022 జులైలో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆయనకు ఇంద్రపీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ జంట 2015లో విడిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు రెండో భార్యకు ఆడిపిల్ల పుట్టింది. దీంతో భగవంత్ మాన్ మూడోసారి తండ్రయ్యారు. కాగా, పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలా పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్.