NV Ramana: అమరావతి కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ
- విజయవాడ విమానాశ్రయంలో జస్టిస్ ఎన్‌వీ రమణను కలిసి వినతిపత్రం ఇచ్చిన అమరావతి రైతులు
- రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా న్యాయస్థానంలో నిలబడటం కలిచివేసిందన్న మాజీ సీజేఐ
- రైతుకు, భూమికి ఉన్న సంబంధం తల్లి, బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదన్న ఎన్‌వీ రమణ
- ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని అన్నదాతలకు న్యాయం చేస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడి
విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1563 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నట్లు రైతులు తనతో చెప్పారని ఆయన అన్నారు. రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని తెలిపారు. తాను కూడా రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చానని గుర్తు చేశారు. రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి, బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదన్నారు. రైతు భూమి కోల్పోవడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు.
ఐదేళ్లుగా రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా న్యాయస్థానంలో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని అన్నదాతలకు న్యాయం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్లకు న్యాయవ్యవస్థ కూడా తోడుగా ఉంటుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని, వారి ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పుకొచ్చారు.