SRH: ఉప్పల్ లో సన్ రైజర్స్ సునామీ... ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు

SRH creates history by making highest score in IPL

  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి సన్ రైజర్స్ కు బ్యాటింగ్ అప్పగించిన ముంబయి
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే!
  • 263 పరుగులతో ఆర్సీబీ పేరిట ఉన్న రికార్డు తెరమరుగు

పరుగుల సునామీ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో చరిత్ర సృష్టించింది. సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ను ఓ గల్లీ స్థాయికి మార్చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. 

గతంలో అత్యధిక స్కోరు రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. ఆర్సీబీ గతంలో 263 పరుగులు చేయగా, ఐపీఎల్ లో ఇప్పటివరకు అదే హయ్యస్ట్ స్కోర్ గా ఉంది. ఇప్పుడా రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తిరగరాసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. 


నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టాపార్డర్ బ్యాటర్లు ఒకరితో ఒకరు పోటీ పడి బాదేశారు. ముఖ్యంగా, హెన్రిచ్ క్లాసెన్ ప్రళయకాల రుద్రుడిలా చెలరేగి 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ముంబయి బౌలర్లను చీల్చిచెండాడాడు. క్లాసెన్ 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో ఐడెన్ మార్ క్రమ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి క్లాసెన్ కు సహకారం అందించాడు. 

అంతకుముందు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 11 పరుగులకే అవుటైనా, ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ ముంబయి బౌలర్లను ఉతికారేశాడు. హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులు  చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ కు పర్యాయపదంలా వీరవిహారం చేశాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. 

సన్ రైజర్స్ బ్యాటర్లు ఇలా ఒకరిని మించి మరొకరు కసిదీరా కొడుతుండడంతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ అయితే మ్యాచ్ చూడడం మానేసి ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారు. ఆమె తనయుడు ఆకాశ్ అంబానీ సన్ రైజర్స్ విధ్వంసం కొనసాగుతున్నంత సేపు తీవ్ర నిరాశతో కనిపించాడు. 

అదే సమయంలో, సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం అంబరాన్నంటింది. ముఖ్యంగా, ఆ జట్టు యజమాని కావ్యా మారన్ తమ ఆటగాళ్లు భారీ షాట్లతో విరుచుకుపడుతుంటే ఎగిరి గంతులేశారు. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన టాలీవుడ్ సినీ నిర్మాత డి.సురేశ్ బాబు, యంగ్ హీరో విజయ్ దేవరకొండల సంగతి సరేసరి. వారిలో ఆనందం ఉప్పొంగింది. సురేశ్ బాబు అయితే చిన్నపిల్లాడిలా సంబరపడ్డారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం దారుణంగా బెడిసికొట్టింది. బుమ్రా, పాండ్యా, కోట్జీ, పియూష్ చావ్లా వంటి ప్రతిభావంతులైన బౌలర్లు ఉన్నప్పటికీ, సన్ రైజర్స్ పరుగుల ప్రళయాన్ని ఆపడం వారి శక్తికి మించిన పనైంది.

More Telugu News