BJP: లోక్ సభ ఎన్నికల కోసం ఏడో జాబితాను విడుదల చేసిన బీజేపీ
- మహారాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ రాణాకు టిక్కెట్
- 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నవనీత్ రాణా
- చిత్రదుర్గ లోక్ సభ స్థానం నుంచి గోవింద్ కర్జోల్‌కు టిక్కెట్ ఇచ్చిన బీజేపీ
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో కూడిన ఏడో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మహారాష్ట్రలోని అమరావతి, కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ రిజర్వ్డ్ (ఎస్సీ) స్థానం నుంచి నవనీత్ రాణా, కర్ణాటకలోని చిత్రదుర్గ రిజర్వ్డ్ నియోజకవర్గం (ఎస్సీ) నుంచి గోవింద్ కార్జోల్‌ను బరిలోకి దింపింది.
నవనీత్ రాణా అమరావతి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ చిత్రదుర్గ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్రదుర్గ స్థానం నుంచి బీజేపీ నేత ఎ.నారాయణస్వామి విజయం సాధించారు.
అమరావతి, చిత్రదుర్గ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, హర్యానా ఉపఎన్నికల కోసం 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఖాళీ చేసిన కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ పేరును బీజేపీ ప్రకటించింది. నయాబ్ సైనీ ఈ నెల ప్రారంభంలో హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.