Ramakrishna Mission: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం
- కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో తుదిశ్వాస
- వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో జనవరి 29న హాస్పిటల్‌లో చేరిక
- నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మంగళవారం రాత్రి నిర్యాణం చెందారు. 95 ఏళ్ల వయసున్న ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ -బేలూరు మఠం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 8:14 గంటల సమయంలో స్మరణానంద మహాసమాధికి చేరుకున్నారని, తీవ్ర విచారంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని బేలూరు మఠం పేర్కొంది. స్వామి స్మరణానంద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో జనవరి 29న హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం కూడా జటిలంగా మారడంతో మార్చి 3 నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు.
కాగా స్మరణానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. స్మరణానంద మహారాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికత, సేవలకు అంకితం చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది హృదయాలు, మనస్సులపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. స్మరణానంద అంకితభావం, విజ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు. స్వామి స్మరణానందతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని అన్నారు. 2020లో తాను బేలూరు మఠాన్ని సందర్శించానని ప్రధాని గుర్తుచేసుకున్నారు. కొన్ని వారాల క్రితం కోల్‌కతాలో హాస్పిటల్‌ను సందర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు.