BJP: నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన తమిళసై.. కొద్దిసేపటి తర్వాత జరిగిన పరిణామంతో అందరూ షాక్!
![BJP MP Candidate Tamilisai Soundararajan filed Nomination](https://imgd.ap7am.com/thumbnail/cr-20240325tn66016bd332209.jpg)
- తమిళసై సౌందరాజన్‌కు సౌత్ చెన్నై ఎంపీ టికెట్ కేటాయించిన బీజేపీ
- సోమవారం నామినేషన్ వేసిన తెలంగాణ మాజీ గవర్నర్
- అదే సమయంలో అక్కడికి వచ్చిన డీఎంకే మహిళ నేత తమిజాచి తంగపాండియన్
- ఇద్దరు మహిళా నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్న వైనం
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరాజన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెకు సౌత్ చెన్నై ఎంపీ టికెట్ కేటాయించింది. ఇక తమిళనాడులో మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా నేటి (సోమవారం) నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళిసై కూడా ఇవాళ తన నామినేషన్ వేశారు. అలా ఆమె నామినేషన్ దాఖలు చేసి, బయటకు వస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
అదే సమయంలో తన సమీప ప్రత్యర్థి అయిన డీఎంకే మహిళా నేత తమిజాచి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. దాంతో ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. అంతే.. ఇద్దరు నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, అప్యాయంగా పలకరించుకున్నారు. అది చూసిన అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో వారిద్దరూ అలా ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ కొద్దిసేపు విస్మయానికి గురి చేసింది.