Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరిన్ని చిక్కులు.. ఆప్ కు ఖలిస్థానీ గ్రూపులు రూ. 133 కోట్లు ఇచ్చాయన్న గురుపత్వంత్ సింగ్
- 2014-22 మధ్య ఖలిస్థానీ గ్రూపుల నుంచి ఆప్ కు నిధులు అందాయన్న గురుపత్వంత్
- టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని వ్యాఖ్య
- 2014లో న్యూయార్క్ లో ఖలిస్థానీ అనుకూలవాదులు, కేజ్రీవాల్ భేటీ అయ్యారని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేజ్రీవాల్ పై పంజాబ్ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ గ్రూపుల నుంచి 2014 - 2022 మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 133.54 కోట్ల నిధులను స్వీకరించిందని ఆయన తెలిపారు. తమకు ఆర్థికసాయం చేస్తే జైల్లో ఉన్న టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లలో దేవీందర్ పాల్ ఉన్నారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోగా... మరో 31 మంది గాయపడ్డారు.
గరుపత్వంత్ సింగ్ కు అమెరికా, కెనడాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఖలిస్థానీ ఉద్యమ నేతగా ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. 2014లో న్యూయార్క్ లోని రిచ్ మండ్ హిల్ లో కేజ్రీవాల్, ఖలిస్థానీ అనుకూలవాదుల మీటింగ్ జరిగిందని గురుపత్వంత్ తెలిపారు. ఆర్థికసాయం చేస్తే... దీనికి బదులుగా దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేశారని చెప్పారు. కేజ్రీవాల్ పై గురుపత్వంత్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. జనవరిలో ఆయన మాట్లాడుతూ... అమెరికా, కెనడాలో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ 6 మిలియన్ డాలర్ల విరాళాలను అందుకున్నారని ఆరోపించారు.