Arvind Kejriwal: ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్!
- లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ
- ‘మిస్సింగ్ మొబైల్’గా పేర్కొన్న ఈడీ అధికారులు
- ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం విచారణలో భాగంగా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పినట్టుగా సమాచారం. కాగా ఈ ఫోన్‌ను ‘మిస్సింగ్ మొబైల్’గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాగా కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఆదివారం విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సమీర్ మహేంద్రు వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఇక మంగళవారం మనీశ్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సి.అరవింద్ ఎదుట కేజ్రీవాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కాగా ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ ఆదివారం తొలి ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాగునీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అతిషి, అధికారులను ఆయన ఆదేశించారు. వేసవికాలం రావడంతో నీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేరకు నీటి ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి అతిషి మీడియాకు వెల్లడించారు. కేజ్రీవాల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు తనకు కన్నీళ్లను తెప్పించిందని ఆమె అన్నారు.