Nara Lokesh: వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడంలేదా?: నారా లోకేశ్
- ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
- గత మూడ్రోజుల్లో లోకేశ్ వాహనాలను నాలుగుసార్లు తనిఖీ చేసిన పోలీసులు
- కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటన్న లోకేశ్
పోలీసులు గత మూడ్రోజుల వ్యవధిలో నాలుగుసార్లు తన కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడంలేదా? అని నిలదీశారు. డీజీపీ ఆదేశాలతోనే తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని లోకేశ్ వెల్లడించారు.
ఇక, నిన్న విజయవాడలో చంద్రబాబు సమావేశంలో ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కనిపించడం పట్ల లోకేశ్ స్పందించారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కు ఏం పని? అని మండిపడ్డారు. డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని అన్నారు.
గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు.