Kotamreddy Sridhar Reddy: ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి కళ్లముందు కనిపిస్తోంది: కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy Live

  • వైసీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఫైర్
  • యథా నాయకుడు.. తథా అనుచరులంటూ ఆరోపణ
  • సాక్షాత్తూ సీఎం జగన్ తన సొంత చెల్లెల్లను వేధిస్తున్నారని విమర్శ
  • కార్యకర్తలు కూడా వారి నాయకుడిని ఫాలో అవుతున్నారన్న కోటంరెడ్డి

యథా నాయకుడు.. తథా అనుచరులు అన్నట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు బరితెగించి వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ సలహాదారుల మాటలు విని సాక్షాత్తూ సీఎం జగన్ తన సొంత సోదరిని ఇష్టారీతిగా వేధిస్తున్నారని ఆరోపించారు. నాయకుడు చూపిన బాటలోనే అనుచరులు, కార్యకర్తలు నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఉచ్చనీచాలు మరచి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు. ఈమేరకు ఆదివారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ వ్యాఖ్యలపై మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లను తీసుకుని అసహ్యమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలంగాణ ఎన్నికల ముందు అక్కడి నాయకులు ఎన్ని యూట్యూబ్ చానళ్లను కొనుగోలు చేసినా ఫలితాలపై ప్రభావం చూపించలేకపోయారనే విషయం మరిచిపోవద్దని అధికార పార్టీకి కోటంరెడ్డి హితవు పలికారు.

తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఆరోపణలను కోటంరెడ్డి ఖండించారు. చెల్లెలు వరుసయ్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ అసహ్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల క్రితం ఆది దంపతులు అన్న నోటితోనే ఇప్పుడు తిట్లదండకం చదువుతున్నారని విమర్శించారు. నెల రోజుల క్రితం ఆదిదంపతులుగా కనిపించిన వేమిరెడ్డి దంపతులు ఈరోజు వేరేలా ఎందుకు కనిపిస్తున్నారంటూ ప్రసన్న కుమార్ ను ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి ప్రత్యర్థిగా నిలబడడంతో ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటమి కళ్లముందు కనబడుతోందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నాడని విమర్శించారు. 

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బతుకేంటని ప్రసన్న కుమార్ అడుగుతున్నాడని, ఆయన బతుకు గురించి తాను చెబుతున్నా జాగ్రత్తగా వినాలంటూ కోటంరెడ్డి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించి, సొంత డబ్బుతో పేదలను ఆదుకుంటున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నింటినో నిర్వహించారని తెలిపారు. నిజానికి ప్రభాకర్ రెడ్డికి వైసీపీ వెన్నుపోటు పొడించిందని ఆరోపించారు. వేమిరెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థులకు గొడవలు పెట్టి కుట్రలు చేసిందని అన్నారు. మరోసారి వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ధీటుగా సమాధానం చెబుతానంటూ ప్రసన్న కుమార్ రెడ్డిని కోటంరెడ్డి హెచ్చరించారు.

వేమిరెడ్డి దంపతులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ ప్రసన్న కుమార్ చేసిన ఆరోపణలపైనా కోటంరెడ్డి స్పందించారు. పార్టీ మారడమే నమ్మకద్రోహమైతే కాంగ్రెస్ నుంచి లక్ష్మీపార్వతి పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తిరిగి మళ్లీ వైసీపీలో చేరిన ప్రసన్న కుమార్ ది నమ్మకద్రోహం, వెన్నుపోటు కాదా అని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్ ది నమ్మకద్రోహం కాదా అని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ నాలుగు మాట్లాడితే.. తామూ నాలుగు మాట్లాడతామని, వ్యక్తిత్వ హననానికి దిగితే దీటుగా స్పందిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తాను ఏడాది కిందటే బయటపెట్టానని కోటంరెడ్డి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. నిజంగా లక్షల మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం విజయసాయి రెడ్డికి ఉంటే తన నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు.

Kotamreddy Sridhar Reddy
Press Meet
YSRCP
Youtube Channels
Prasanna kumar Reddy
TDP
Vemireddy Prabhakar Reddy

More Telugu News