Murali Mohan: భక్తి మా అమ్మగారి నుంచి వచ్చింది .. నా ఇష్టదైవం ఆయనే: నటుడు మురళీమోహన్
- అనేక రంగాల్లో రాణించిన మురళీమోహన్
- సూర్యభగవానుడంటే ఇష్టమని వెల్లడి
- 36 సార్లు అయ్యప్ప మాల తీసుకున్నానని వివరణ
- దేవాలయాలకు ఎక్కువగా తిరిగే అలవాటు లేదన్న మురళీ మోహన్
మురళీమోహన్ .. నటుడిగా .. నిర్మాతగా .. వ్యాపారవేత్తగా .. రాజకీయనాయకుడిగా .. ఇలా అనేక రంగాలలో ఆయన రాణించారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ, తనలోని భక్తి కోణం గురించి ప్రస్తావించారు. " మా అమ్మగారికి భక్తి ఎక్కువ .. ఆమె శ్రీరాముడిని .. శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించేవారు. అందుకు సంబంధించిన శ్లోకాలు ఆమెకి కంఠతా వచ్చు. స్కూల్ కి వెళ్లేటప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకుని వెళ్లమని చెప్పింది మా అమ్మగారే" అని అన్నారు.
"నేను మా అమ్మగారు చెప్పినట్టుగానే ఉదయాన్నే పూజ చేసుకున్న తరువాతనే నా దైనందిన కార్యక్రమాలను మొదలుపెడతాను. ఏ రోజు ఏ దేవుడికి ఇష్టమో .. ఆ రోజున ఆ దేవుడిని పూజిస్తాను. దేవుళ్లంతా ఇష్టమే అయినా .. సూర్యభగవానుడిని కాస్త ఎక్కువగా ఇష్టపడతాను. ఆయన ప్రత్యక్ష దైవం. వెలుగును .. వేడిని ప్రసాదించేవాడు ఆయనే. అందువలన ఆయనను ప్రతి రోజు పూజిస్తూ ఉంటాను. సూర్యోదయాన్ని .. సూర్యాస్తమయాన్ని తప్పనిసరిగా చూస్తుంటాను" అని చెప్పారు.
" ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడమే నాకు అలవాటు. ఎక్కువగా దేవాలయాలకి తిరిగే అలవాటు లేదు. అలాగే ఉపవాసాలు ఉండటం కూడా అలవాటు లేదు. అయ్యప్ప స్వామి దీక్షను ఇంతవరకూ 36 సార్లు తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నా మండల దీక్షనే చేశాను. ఆ సమయంలో మాత్రం నియమ నిష్ఠలను తప్పనిసరిగా పాటిస్తాను. దైవారాధన వలన మనసు ప్రశాంతతను పొందుతుంది" అని అన్నారు.