Nitin Gadkari: ఎన్నికల బాండ్ల వెనకున్న కారణం చెప్పిన నితిన్ గడ్కరీ
- గుజరాత్‌లో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న గడ్కరీ
- నిధుల సమీకరణలో పారదర్శకత కోసం ఎన్నికల బాండ్లు తెచ్చామని వెల్లడి
- ప్రభుత్వాలు మారినప్పుడు దాతలకు ఇబ్బంది రాకుండా వివరాలను గోప్యం చేశామన్న మంత్రి
నిధులు లేకుండా రాజకీయ పార్టీ నడపడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టారు. సదుద్దేశంతోనే తాము అప్పట్లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అధికార పక్షానికి నిధులిచ్చిన సంస్థలు ప్రభుత్వం మారాక చిక్కుల్లో పడకూడదనే వారి వివరాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. గాంధీనగర్ సమీపంలోని గిఫ్ట్ సిటీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమాచారహక్కును ఉల్లంఘించిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే.
‘‘అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్టోరల్ బాండ్లపై జరిగిన చర్చల్లో నేనూ పాల్గొన్నా. నిధులు లేకుండా పార్టీలు మనలేవు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిధులు సమకూరుస్తాయి. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి, మేము ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చాలని నిర్ణయించాం. మీరు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నిధులు లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయి? నిధుల సమీకరణలో పారదర్శకత కోసమే ఈ పథకాన్ని తెచ్చాం. ఇందులో దోషాలేమైనా ఉంటే సరిదిద్దుకోమని సుప్రీం కోర్టు చెప్పాలి. అప్పుడు అన్ని పార్టీలు దీనిపై చర్చ జరిపి ఉండేవి’’ అని నితిన్ గడ్కరీ అన్నారు.