INS Kolkata: 35 మంది సముద్రపు దొంగలతో ముంబై చేరుకున్న భారత యుద్ధనౌక
- ఈ నెల 15న పైరేట్ల ఆటకట్టించిన భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా
- 40 గంటల ఆపరేషన్ తర్వాత 35 మంది సముద్రపు దొంగలను బంధించిన నేవీ
- ముంబై పోలీసులకు పైరేట్ల అప్పగింత
సోమాలియా తీరంలో సముద్రపు దొంగల (పైరేట్స్) ఆటకట్టించిన భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. ఆ వెంటనే తాము బంధించిన 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. ఇందులో భాగంగా నౌకలను మోహరించింది.
ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్‌కతాకు సాయంగా ఐఎన్ఎస్ సుభద్ర కూడా చేరింది. ఈ రెండింటికి సపోర్టుగా భారత వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ మరింత ఈజీగా ముగిసింది. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.