BRS: మద్యం కేసులో కవిత నిందితురాలు కాదు... ఆమె బయటకు వస్తుంది: బీఆర్ఎస్ ఎంపీలు
- రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసిందని ఆరోపణ
- మహిళ అని కూడా చూడకుండా కవితను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య
- శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపణ
ఢిల్లీ మద్యం కేసులో కవిత నిందితురాలు కాదని... బాధితురాలని... ఆమె బయటకు వస్తుందని బీఆర్ఎస్ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా కవితను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ కుట్రలు చేసిందన్నారు. బీజేపీకి లొంగని రాష్ట్ర ప్రభుత్వాలను ఈడీ దాడుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు చేసుకుంటాయని... ఢిల్లీ మద్యం పాలసీలో కవితను భాగస్వామ్యం చేయడం రాజకీయ కక్షపూరితమే అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో తమకు లొంగని పార్టీలపై బీజేపీ ఈడీ దాడులు చేయిస్తూ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలను చూసి మున్ముందు తెలంగాణలో బీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని కోరారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ముఖ్యంగా రైతుల కోసం అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిందన్నారు.
కవిత అరెస్ట్‌పై కూడా బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. కవితకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.