Congress Party Funds: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడంపై సోనియా సహా అగ్రనేతల స్పందన

Systematic Effort By PM To Cripple Congress Financially Says Sonia Gandhi

  • ఎన్నికల ముందు పార్టీని ఇబ్బంది పెట్టేందుకేనని ఆరోపణ
  • ఫండ్స్ ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న సోనియా
  • ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ మాజీ చీఫ్
  • ఢిల్లీలో గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన కాంగ్రెస్ అగ్ర నేతలు 

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్ గా వ్యవహరించారంటూ మోదీని దుయ్యబట్టారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మోదీపై ఇవే ఆరోపణలు గుప్పించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దేశంలో పెద్ద మొత్తంలో లబ్ది పొందిన పార్టీ ఏదనేది అందరికీ తెలుసని చెప్పారు.

ఈమేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై పార్టీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా, రాహుల్ గాంధీలతో పాటు సీనియర్ నేతలు మాట్లాడారు. ఎన్నికల సమయంలో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టడం కష్టమని పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయాలని కుట్ర చేస్తున్నారని మాకెన్ ఆరోపించారు. ఎప్పుడో సీతారామ్‌ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారని, చిన్న చిన్న లోపాలను అడ్డుపెట్టుకుని తీవ్ర చర్యలు చేపడుతున్నారని మాకెన్ విమర్శించారు.

More Telugu News