Palamuru: చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి మృతి

Telangana Man dies of heart attack In China

  • గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. 
  • ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత
  • మృతదేహాన్ని భారత్ కు తరలించాలంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి ఒకరు అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. మరో నాలుగు రోజుల్లో భారత్ కు తిరిగి రావాల్సి ఉండగా అంతలోనే మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామస్థుడు సేవకుల జ్ఞానానంద్ చనిపోయినట్లు మార్చి 17న ఫోన్ కాల్ వచ్చిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బీజింగ్ లో ఉంటున్న జ్ఞానానంద్ స్నేహితుడు ఫోన్ చేసి విషయం చెప్పారని వివరించారు. ప్రస్తుతం జ్ఞానానంద్ మృతదేహం బీజింగ్ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచినట్లు సమాచారం అందిందని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న జ్ఞానానంద్ చైనాకు వెళ్లాడు. అప్పటి నుంచి తరచూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జ్ఞానానంద్.. మార్చి 16 తర్వాత కాంటాక్ట్ లోకి రాలేదు. పనిలో బిజీగా ఉండడంతో ఫోన్ చేయలేదని భావించామని, అయితే, మరుసటి రోజు ఆయన మరణవార్త తెలిసిందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిన జ్ఞానానంద్ ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారన్నారు. కాగా, జ్ఞానానంద్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చైనాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

బీజింగ్ లోనే జ్ఞానానంద్ మృతదేహాన్ని ఖననం చేసి, అస్థికలను పంపిస్తామని రాయబార కార్యాలయం అధికారులు సూచించగా.. కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్వదేశంలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేస్తామని, జ్ఞానానంద్ భౌతికకాయాన్ని ఎలాగైనా భారత్ కు పంపించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని, తమకు సాయం చేయాలని జ్ఞానానంద్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News