Earthquake: మహారాష్ట్రలో 10 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన జనం!
- మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంపం
- హింగోలితో పాటు పర్భానీ, నాందేడ్‌లో భూప్రకంపనలు
- రిక్టర్ స్కేల్‌పై తీవ్రత వరుసగా 4.5, 3.6గా గుర్తింపు
- భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన నాందేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో భూమి రెండు సార్లు కంపించింది. సుమారు 10 సెక్లన పాటు భూమి కంపించింది. హింగోలితో పాటు పర్భానీ, నాందేడ్‌లో భూ ప్రకంపనలు కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరాల ప్రకారం మొదటి కంపనం ఉదయం 6.08 గంటలకు సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. అలాగే పది నిమిషాల తర్వాత రెండో కంపనం 6.19 గంటల ప్రాంతంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు నాందేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గుర్తించింది. నాందేడ్ జిల్లా పరిధిలోని అర్ధాపూర్, ముద్‌ఖేడ్, నాయిగామ్, దెగ్లూర్, బిలోలి ప్రాంతాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.