1500 HP Enginegine: ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయ 1500 హెచ్‌పీ ఇంజన్ సిద్ధం.. రక్షణ శాఖ కీలక విజయం
- మైసూరులో విజయవంతంగా పరీక్షించామని ప్రకటించిన రక్షణ మంత్రిత్వశాఖ
- భారత సైనిక సామర్థ్యాలను పెంపొందించనుందని వెల్లడి
- దేశ రక్షణ సామర్థ్యాలలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రకటన
ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి 1500 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. కర్ణాటకలోని మైసూరులో బీఈఎంఎల్ ఇంజన్ విభాగంలో బుధవారం టెస్ట్ ఫైరింగ్ నిర్వహించామని, రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే సారధ్యంలో ఈ పరీక్ష జరిగిందని వివరించింది. భారత సైనిక సామర్థ్యాలను పెంపొందించే కీలక సందర్భం ఇది అని ప్రకటనలో రక్షణ శాఖ పేర్కొంది. దేశ రక్షణ సామర్థ్యాలలో కొత్త శకానికి ఈ విజయం నాంది పలికిందని వ్యాఖ్యానించింది. రక్షణ రంగ సాంకేతికత నైపుణ్యాల విషయంలో స్వావలంబనను ఈ పరీక్ష చాటి చెబుతోందని రక్షణశాఖ వ్యాఖ్యానించింది.
కాగా 1500 హెచ్‌పీ ఇంజన్ మిలిటరీ ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో మార్పులు తీసుకురానుందని రక్షణ శాఖ తెలిపింది. హై పవర్ టు వెయిట్ రేషియో, అధిక ఎత్తులు, సబ్-జీరో ఉష్ణోగ్రతలు, ఎడారి వాతావరణంతో సహా తీవ్రమైన పరిస్థితులలో పనిచేయగలదని, అత్యాధునిక లక్షణాలు ఈ ఇంజన్‌లో ఉన్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న అత్యాధునిక ఇంజన్‌లతో ఇది సమానమని తెలిపింది. కాగా ఇంజన్ పరీక్షలో రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ సివిల్, సైనిక అధికారులతో పాటు కీలక భాగస్వాములు, బీఈఎంఎల్ అధికారులు పాల్గొన్నారు.
బీఈఎంఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతాను రాయ్ మాట్లాడుతూ.. రక్షణ ఉత్పత్తికి కీలకమైన భాగస్వామిగా బీఈఎంఎల్ స్థానాన్ని ఈ విజయం మరింత పటిష్ఠం చేసిందని వ్యాఖ్యానించారు. దేశ అవసరాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేసేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలియజేస్తున్నామని అన్నారు. కాగా ఈ ప్రాజెక్టును ఆగస్టు 2020లో మొదలుపెట్టగా 2025 మధ్య పూర్తి కానుందని తెలిపారు.