USA: అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ భూభాగమే.. చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్

Recognise Arunachal Pradesh As Indian Territory US On Chinas Claim

  • అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా గుర్తించామన్న అమెరికా
  • వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను మార్చే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టీకరణ
  • అరుణాచల్ ప్రదేశ్‌ మాదేనంటూ చైనా ప్రకటన నేపథ్యంలో అమెరికా స్పందన

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ (అరుణాచల్ ప్రదేశ్) మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సైన్యాలను సరిహద్దులకు తరలించేందుకు సర్వకాలాల్లోనూ అందుబాటులో ఉండే ఈ టన్నెల్‌కు భద్రతాకారణాల రీత్యా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా తమ భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. 

మరోవైపు, చైనా ప్రకటనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఉత్తుత్తి పేర్లతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది.

More Telugu News