Congress: ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ సోనియాగాంధీకి సంపత్ కుమార్ లేఖ

Fight for Nagarkunrool ticket in congress

  • ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పని చేస్తున్నానన్న సంపత్ కుమార్
  • టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
  • నాగర్ కర్నూలులో మాలల కంటే మాదిగల ఓట్లు ఎక్కువ అని వెల్లడి

నాగర్ కర్నూలు లోక్ సభ సీటు వ్యవహారంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మల్లు రవి, సంపత్ కుమార్‌లు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంపత్ కుమార్ లేఖ రాశారు. తాను ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకంగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. కానీ టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని వాపోయారు.

నాగర్ కర్నూలు లోక్ సభ స్థానంలో మాదిగల ఓట్లు ఎక్కువగా ఉంటాయని... మాలల ఓట్లు తక్కువగా ఉంటాయని తెలిపారు. కాబట్టి తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా మల్లు రవికి ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారని... కేబినెట్ హోదా కూడా కల్పించారని గుర్తు చేశారు. ఈసారి తనకు లోక్ సభ టిక్కెట్ ఇవ్వాలని కోరారు.

నాగర్ కర్నూలు నుంచి సీఈసీ ఒకే పేరును ప్రతిపాదించినట్లుగా తెలిసిందని... అది కూడా మల్లు రవి పేరును ప్రతిపాదించారని తెలిపారు. సీఈసీ సభ్యులు అసలు ఒకే పేరును ఎలా ప్రతిపాదిస్తారని కూడా సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నాలుగుసార్లు ఓడిపోయిన నాయకుడిని ప్రతిపాదించడం సరికాదన్నారు. నాగర్ కర్నూల్ నుంచి తానే సరైన అభ్యర్థిని అని... తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

More Telugu News