Navjot Singh Sidhu: పదేళ్ల తర్వాత కామెంట్రీ బాక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సిద్ధూ
- గతంలో కామెంటేటర్ గా అలరించిన సిద్ధూ
- పంచ్ లు, సెటైర్లతో కామెడీగా కామెంట్రీ చెప్పడంలో సిద్ధూ ఎక్స్ పర్ట్
- గతంలో ఓ టోర్నీ మొత్తం కామెంట్రీ చెబితే రూ.70 లక్షలు
- ఇప్పుడు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కు రూ.25 లక్షలు తీసుకుంటున్నట్టు సిద్ధూ వెల్లడి
భారత క్రికెట్ కు సంబంధించి 80, 90వ దశకాల్లో డాషింగ్ క్రికెటర్ అంటే నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురించే చెప్పుకోవాలి. ఓపెనర్ గా బరిలో దిగే ఈ సర్దార్జీకి ప్రత్యర్థి బౌలింగ్ ను చీల్చి చెండాడడమంటే సరదా.
ఇక, మైదానంలో ఎవరైనా మాటల యుద్ధం ప్రారంభిస్తే, వారికి అంతకంతకు బదులివ్వందే వెనుదిరగడు. సిద్ధూ మంచి మాటకారి. క్రికెట్ నుంచి రిటైరయ్యాక క్రికెట్ కామెంటేటర్ గానూ తనదైన ముద్ర వేశారు. ఆయన రాజకీయాల్లోనూ ఉన్నప్పటికీ అది వేరే సంగతి. పంచ్ లు, సెటైర్లతో క్రికెట్ కామెంట్రీ చెప్పడం సిద్ధూ స్టయిల్. ఇది భారత ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.
అయితే, గత పదేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న సిద్ధూ కామెంట్రీ వైపు చూడలేదు. దశాబ్దకాలం తర్వాత ఈ పంజాబీ యోధుడు మళ్లీ కామెంట్రీ బాక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ లో స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్స్ జాబితాలో సిద్ధూ పేరు కూడా ఉంది.
దీనిపై సిద్ధూ స్పందిస్తూ, సుదీర్ఘ విరామం వచ్చినా తన కామెంట్రీలో పదును ఏమాత్రం తగ్గలేదని అన్నారు. తొలినాళ్లలో కామెంట్రీ చెప్పేటప్పుడు తనలో ఆత్మవిశ్వాసం లోపించిందని, కానీ వరల్డ్ కప్ మ్యాచ్ లకు తాను చెప్పిన కామెంట్రీ సూపర్ హిట్ కావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ కామెంట్రీ అభిమానులను విశేషంగా అలరించిందని సిద్ధూ వివరించారు.
ఇక, కామెంటేటర్ గా తన పారితోషికం ఎంతో సిద్ధూ వెల్లడించారు. ఇంతకుముందు రోజుల్లో ఓ టోర్నీ మొత్తం కామెంట్రీ చెబితే దాదాపు రూ.70 లక్షల వరకు ఇచ్చేవారని, ఇప్పుడు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కు తాను రూ.25 లక్షలు తీసుకుంటున్నానని తెలిపారు.
అయితే డబ్బు కంటే, ఆటగాళ్లతో సరదాగా గడిపేందుకు ఐపీఎల్ ను ఓ వేదికగా భావిస్తానని అభిప్రాయపడ్డారు.