IPL 2024: వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ ఆట‌గాళ్ల సంద‌డి.. జ‌ట్టుతో చేరిన గంగూలీ, వార్న‌ర్‌

Delhi Capitals Players in Vizag

  • ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు రెండో హోం గ్రౌండ్‌గా వైజాగ్ స్టేడియం
  • వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన డీసీ 
  • తాజాగా వైజాగ్ విమానాశ్ర‌యంలో దిగిన‌ సౌర‌వ్ గంగూలీ, డేవిడ్ వార్న‌ర్
  • వైజాగ్‌లో మార్చి 31, ఏప్రిల్ 3న ఢిల్లీకి రెండు కీల‌క మ్యాచులు 
  • ఈ సీజ‌న్‌లో త‌న ప్రారంభ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నున్న‌ ఢిల్లీ

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) వైజాగ్‌ను త‌మ సెకండ్ హోం గ్రౌండ్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో డీసీ త‌మ మొద‌టి భాగం హోమ్ మ్యాచుల‌ను వైజాగ్‌లో ఆడ‌నుంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఢిల్లీ జ‌ట్టు వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది కూడా. రిష‌బ్ పంత్‌, య‌ష్ ధూల్, ఇషాంత్ శ‌ర్మ వంటి స్టార్స్ ఇక్క‌డ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా ఆసీస్ స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌, డీసీ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ వైజాగ్ విమానాశ్ర‌యంలో దిగారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. జ‌ట్టు బ‌స చేస్తున్న హోట‌ల్‌కు చేరుకున్న‌ గంగూలీకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు అక్క‌డి సిబ్బంది. ఇక వైజాగ్ క్రికెట్ మైదానం ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో రెండు కీల‌క మ్యాచుల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మార్చి 31న చెన్నైతో ఢిల్లీ త‌ల‌ప‌డ‌నుంది. అలాగే ఏప్రిల్ 3న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో మ‌రో మ్యాచ్‌ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌ల‌కు సంబంధించిన టికెట్ బుకింగ్స్‌పై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.     

కాగా, ఈ సీజ‌న్‌లో ఢిల్లీ త‌న ప్రారంభ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది. ఇక 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మైన కెప్టెన్ రిష‌బ్ పంత్ పూర్తిగా కోలుకుని తిరిగి టీమ్‌తో చేర‌డం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. ఈ యువ ఆట‌గాడి రాక‌తో డీసీ బ‌లంగా క‌న‌బ‌డుతోంది. అయితే, గ‌తేడాది డేవిడ్ వార్న‌ర్ సారథ్యంలో ఢిల్లీ జ‌ట్టు ఘోరంగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. దీంతో ఈ 17వ సీజ‌న్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో టైటిల్ దిశ‌గా దూసుకెళ్లాల‌ని ఢిల్లీ అభిమానులు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News