Most Polluted Capital: ప్రపంచంలోనే కాలుష్య రాజధాని.. ఢిల్లీకి మరోసారి చెత్త రికార్డు

Delhi worlds most polluted capital city again

  • 2018 నుంచి నాలుగోసారి రికార్డుల్లోకి..
  • కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కు మూడోస్థానం
  • తాజాగా కాలుష్య నగరాల జాబితా విడుదల చేసిన ఐక్యూఎయిర్

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి చెత్త రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది. ఇక, దేశం విషయానికి వస్తే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. 2022 లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్.. వేగంగా దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. ఈమేరకు స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ కంపెనీ తాజాగా విడుదల చేసిన కాలుష్య నగరాలు, దేశాల జాబితాలో ఈ వివరాలు వెల్లడించింది. గాలిలో పీఎం 2.5 స్థాయుల ఆధారంగా ఐక్యూఎయిర్ ఈ జాబితాను రూపొందించింది.

ఢిల్లీలో పీఎం 2.5 స్థాయులు 2022 లో ప్రతీ క్యూబిక్ మీటర్ కు 89.1 మైక్రోగ్రాములు ఉండగా.. 2023 నాటికి అది 92.7 మైక్రోగ్రాములకు చేరిందని ఐక్యూఎయిర్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ ఏరియాలలో మన బెగుసరాయ్ లోనే కాలుష్యం అత్యధికమని, అక్కడ సగటున ప్రతీ క్యూబిక్ మీటర్ కు పీఎం 2.5 స్థాయులు 118.9 మైక్రోగ్రాములు ఉందని తెలిపింది. 2022 లో విడుదల చేసిన కాలుష్య నగరాల జాబితాలో బెగుసరాయ్ పేరే లేదు.. కానీ రెండేళ్లలో ఏకంగా అత్యధిక కాలుష్య నగరంగా మారింది. 

పీఎం 2.5 స్థాయులు ఎంతుండాలి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) మార్గదర్శకాల ప్రకారం.. ప్రతీ క్యూబిక్ మీటర్ ఏరియాలోని గాలిలో పీఎం 2.5 స్థాయులు గరిష్ఠంగా 5 మైక్రోగ్రాములు మించకూడదు. అంతకు మించి ఉంటే అస్తమా, క్యాన్సర్, గుండెపోటు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారిన పడతారని హెచ్చరించింది. అయితే, మన దేశంలోని చాలా నగరాలలో ఈ స్థాయులు అత్యధికంగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్ వో గైడ్ లైన్స్ కన్నా దాదాపు ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ చోటుచేసుకుంటున్న ప్రతీ తొమ్మిది మరణాలలో ఒకటి వాయు కాలుష్యం కారణంగానేనని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యంతో సుమారు 70 లక్షల మంది ప్రిమెచ్యూర్ డెత్ కు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ వో ఓ నివేదికలో వెల్లడించింది.

More Telugu News