Group-1 Mains: ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంగ్ కు లేదు: పట్టాభి
- 2018 నాటి గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేసిన హైకోర్టు
- ఆధారాలతో సహా వస్తానంటూ గౌతమ్ సవాంగ్ కు పట్టాభి సవాల్
- కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపణ
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్ కు లేదని స్పష్టం చేశారు. మా వద్ద ఉన్న ఆధారాలతో వస్తా... మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్ధమా? అని పట్టాభి సవాల్ విసిరారు. తప్పు చేసి కూడా ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ తొలగించకముందే సవాంగ్ రాజీనామా చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని, వాల్యుయేషన్ తర్వాత కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని పట్టాభి విమర్శించారు. 2022 మార్చి 25 తర్వాతే మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్టు రెండు సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆరోపించారు.
ఓసారి వాల్యుయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని పట్టాభి ప్రశ్నించారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యుయేషన్ జరపాలని లేఖ రాశారని వెల్లడించారు. రెండోసారి వాల్యుయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారని వివరించారు.
"గ్రూప్-1లో అక్రమాలను ఆధారాలతో సహా చూపిస్తున్నా బుకాయిస్తారా? మాన్యువల్ మూల్యాంకనం చేయించకపోతే హాయ్ ల్యాండ్ వారికి రూ.20 లక్షలు ఎందుకు చెల్లించారు? ఒకసారి వాల్యుయేషన్ చేశారు... మళ్లీ వాల్యుయేషన్ చేయించారు. రెండో పర్యాయం వాల్యుయేషన్ కు రూ.20 లక్షలు చెల్లించారు. స్ట్రాంగ్ రూమ్, డీలక్స్ రూమ్ లు వంటి వాటికి జీఎస్టీతో కలిపి రూ.20,06,000 చెల్లించారు" అని పట్టాభి ఆరోపించారు.
బందోబస్తు కోసం కర్నూలు నుంచి వచ్చిన 30 మంది పోలీసులను పిలిచి మాట్లాడదామా గౌతమ్ సవాంగ్? అంటూ సవాల్ విసిరారు. వాల్యుయేషన్ చేయించకపోతే పోలీసులను ఎందుకు పంపారని నిలదీశారు.