China: అరుణాచల్‌ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన

Arunachal Pradesh inherent part of Chinas territory claims Chinese military

  • అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల సెలా సొరంగమార్గం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • మోదీ పర్యటనపై చైనా పరోక్ష అభ్యంతరం 
  • భారత్ చర్యలు శాంతిస్థాపనలకు అనుకూలం కాదని వ్యాఖ్య
  • చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్, చైనా ప్రతిస్పందన
  • అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమేనంటూ తాజాగా చైనా మరో ప్రకటన

విస్తరణ వాదంతో రెచ్చిపోతున్న చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జిజాంగ్ (అరుణాచల్‌ ప్రదేశ్‌కు చైనా పెట్టుకున్న పేరు) తమ భూభాగమేనని స్పష్టం చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పగా కమ్యూనిస్టు దేశం వాదనలను భారత్ తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ తమ భూభాగంలోని ప్రాంతమేనని ప్రకటించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించమని పేర్కొంది. 

అరుణాచల్ ప్రదేశ్‌‌లో సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నెల్ నిర్మించిన విషయం తెలిసిందే. సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నెల్ ఎంతో ఉపకరిస్తుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. 13 వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్‌గా పేరుగాంచింది. 

ఇదిలా ఉంటే,  మోదీ పర్యటనపై అప్పట్లో చైనా పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం రక్షించుకునే క్రమంలో తాము నిత్యం అప్రమత్తంగా ఉంటామని చైనా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ చేపడుతున్న చర్యలు సరిహద్దు వెంబడి శాంతిస్థాపనకు అనుకూలం కాదని అన్నారు. 

అయితే, చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమేనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. చైనా పెట్టుకునే ఉత్తుత్తి పేర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను మార్చబోవని ఇప్పటికే ఘాటుగా బదులిచ్చింది.

More Telugu News