Ajit Agarkar: ఐపీఎల్‌పై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఐపీఎల్‌పై ప్రామాణికంగా టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక చేయబోమని స్పష్టత
- ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకోవడం లేదా దారుణమైన విఫలమైన సందర్భాలను మినహా పెద్దగా ప్రాధాన్యత ఉండదని వెల్లడి
- కోహ్లీకి టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చనే కథనాల నేపథ్యంలో అగార్కర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
ఐపీఎల్ ముఖ్యమైనదే కానీ టీ20 వరల్డ్ కప్-2024 జట్టు ఎంపికకు ప్రామాణికం కాదని బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. గతంలో భారత టీ20 జట్టు ఎంపికలో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అగార్కర్ చెప్పినట్టుగా ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం పేర్కొంది. టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక విషయంలో ఐపీఎల్ ఆధారంగా నిర్ణయాలు పెద్దగా ఉండబోవని, అలాగే ఐపీఎల్‌ను పూర్తిగా పక్కన పెట్టబోమని అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకోవడం లేదా దారుణంగా విఫలమైతే అలాంటి మార్పులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఐపీఎల్ ఆధారంగా టీ20 వరల్డ్ కప్‌కు జట్టు ఎంపిక పెద్దగా మారబోదని ఆయన స్పష్టం చేశారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవచ్చంటూ రిపోర్టులు వెలువడుతున్న నేపథ్యంలో అగార్కర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా విరాట్ మరికొన్ని రోజుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రీ-టోర్నమెంట్ క్యాంప్‌లో చేరబోతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 22న ఆరంభ మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడని వెల్లడించింది.