General Elections: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక వివరాలు ఇవిగో!
- దేశంలో మోగిన ఎన్నికల నగారా
- ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు
- ఏపీలో మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలు. రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల్లో 4 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్ డ్ స్థానం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నారు.
అందులో 2 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా... మహిళా ఓటర్లు 2.07 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రంలో 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఏపీలో ఉన్న సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,434. ఎన్నారై ఓటర్ల సంఖ్య 7,603.
మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఒకే విడతలో జరిగే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తమ్మీద 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో పూర్తిగా మహిళలతో నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 179 కాగా... పూర్తిగా యువతతో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో మొత్తం ఆదర్శ పోలింగ్ కేంద్రాల సంఖ్య 555 అని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.