Revanth Reddy: నేడు ఏపీకి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు
- నేడు విశాఖలో కాంగ్రెస్ పార్టీ న్యాయసాధన సభ
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ
- సాయంత్రం 4 గంటలకు సభ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏపీకి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖకు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ విశాఖకు వెళ్తున్నారు.
ఈ సాయంత్రం విశాఖలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభకు 'న్యాయసాధన సభ' అని పేరు పెట్టారు. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు తదితర కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు దాదాపు 70 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మందిని తీసుకురావలని నిర్ణయించారు. రేవంత్ రానున్న నేపథ్యంలో, ఆయన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.