Chandrababu: గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణలో గతంలో లేని వివాదాలు ఇప్పుడెందుకు తలెత్తాయి?: చంద్రబాబు
- 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
- మూల్యాంకనంలో ప్రభుత్వ వైఫల్యం ఉందన్న చంద్రబాబు
- వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీపీఎస్సీ కూడా బలైందని వెల్లడి
- ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ లోపభూయిష్టమని, మూల్యాంకనంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థల్లాగే ఏపీపీఎస్సీ కూడా బలైందని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి గతంలో ఇలాంటి వివాదాలు లేవని, ఈసారి ఎందుకిలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. మూల్యాంకనం పేరిట మోసపూరిత చర్యలకు దిగారని... ఏమిటీ డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనం? అని మండిపడ్డారు.
తమ వారి కోసం అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని, గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఇలాంటి తప్పిదాలు మునుపెన్నడూ లేవని, సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశారని చంద్రబాబు విమర్శించారు.
మూల్యాంకనం విషయంలో హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్ ను, కార్యదర్శిగా వ్యవహరించిన మరో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును వెంటనే సస్పెండ్ చేయాలని, కేసు నమోదు చేసి విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు.