ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్: మరిన్ని టికెట్లు విడుదల చేస్తున్న ఐసీసీ
- ఇప్పటివరకు అందుబాటులో 37 మ్యాచ్ ల టికెట్లు
- మరో 13 మ్యాచ్ ల టికెట్లను ఈ నెల 19న విడుదల చేయనున్న ఐసీసీ
- జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్
- ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. జూన్ 1 నుంచి 29 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ లో 9 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఓ ఐసీసీ ఈవెంట్ కు తొలిసారిగా వేదికగా నిలుస్తున్న అమెరికా గడ్డపై 16 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
కాగా, ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 37 మ్యాచ్ లకు టికెట్లను ఐసీసీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, మరో 13 మ్యాచ్ ల టికెట్లను కూడా మార్చి 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
రెండు సెమీఫైనల్ మ్యాచ్ ల టికెట్లను కూడా ఈ విడతలోనే అందుబాటులో ఉంచనున్నారు. అయితే, మిగిలిన మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ టికెట్లను తర్వాత విడుదల చేయనున్నారు. tickets.t20worldcup.com పోర్టల్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
కాగా, ఈ టోర్నీలో టీమిండియా గ్రూప్-ఏ లో ఉంది. దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఇదే గ్రూపులో ఉంది.