KCR: వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి విముఖత చూపిన ఆరూరి రమేశ్?

Aroori Ramesh say no to contest from Warangal Lok Sabha seat
  • ఎవరిని బరిలోకి దింపినా సహకరిస్తానని... అధినేత నిర్ణయించిన వ్యక్తిని గెలిపించుకుంటామని హామీ 
  • మరోసారి పోటీకి పసునూరి దయాకర్ సిద్ధమని వెల్లడి
  • వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమీక్ష
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విముఖత చూపారని సమాచారం. అయితే అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపినా తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని... అధినేత నిర్ణయించిన వ్యక్తిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ముఖ్యనేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, మధుసూదనాచారి, పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సమాలోచనలు జరిపారు.

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరుతారని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ తదితర నేతలు ఆయనను స్వయంగా కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థి, ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని నాయకులు అధినేత కేసీఆర్‌కే అప్పగించారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. మరోసారి పోటీ చేసేందుకు పసునూరి దయాకర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.
KCR
Telangana
Warangal Urban District

More Telugu News