Bhukya Krishna Teja: కొన్ని రోజుల్లో పెళ్లి... ఎస్సారెస్సీ కాలువలో తేలిన వరుడి శవం

Bridegroom found dead in SRSC Canal

  • హనుమకొండ జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భూక్యా కృష్ణతేజ
  • నర్సంపేటకు చెందిన అమ్మాయితో ఈ నెల 16న పెళ్లి
  • పెళ్లికార్డులు ఇవ్వడానికి వెళ్లి తిరిగిరాని వైనం

తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు ఎస్సారెస్సీ కాలువలో శవమై తేలాడు. భూక్యా కృష్ణతేజ అనే యువకుడు హైదరాబాద్ లో ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 29 ఏళ్ల కృష్ణతేజ స్వస్థలం హనుమకొండ జిల్లా గోకుల్ నగర్. నర్సంపేటకు చెందిన ఓ యువతితో అతడికి పెళ్లి కుదిరింది. 

ఈ నెల 16న వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికార్డులు ఇవ్వడానికి కృష్ణతేజ ఈ నెల 10న ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు మళ్లీ ఇంటికి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 

అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా, పలివేల్పుల సమీపంలో ఎస్సారెస్సీ కాలువ వద్ద కృష్ణతేజ బైక్ కనిపించింది. దాంతో అతడి కుటుంబ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. 

వర్ధన్నపేట మండలి కుమ్మరిగూడెం వద్ద ఎస్సారెస్సీ కాలువలో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా, అది కృష్ణతేజ మృతదేహం అని గుర్తించారు. 

అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీసులు కృష్ణతేజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

More Telugu News