Arvind Kejriwal: దేశవ్యాప్తంగా ప్రజలు సీఏఏను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారు: అరవింద్ కేజ్రీవాల్
![People Across Country Want Citizen Amendment Act To Be Withdrawn Says Arvind Kejriwal](https://imgd.ap7am.com/thumbnail/cr-20240313tn65f14f11872b8.jpg)
- బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్ నుంచి వచ్చేవారికి ఇక్కడ ఉపాధి ఎవరు? కల్పిస్తారంటూ కేజ్రీవాల్ ధ్వజం
- ఆయా దేశాల నుంచి వచ్చేవారికి బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా? అంటూ విమర్శ
- ఇప్పటికే కేంద్ర నిర్ణయంపై భగ్గుమంటున్న విపక్షాలు
వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) -2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్‌లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?" అని మోదీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
అసలు సీఏఏ నిబంధనలు ఏమిటీ!
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన దేశ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇదిలాఉంటే.. కేంద్ర నిర్ణయంపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్ సీఏం మమతాబెనర్జీ చెప్పారు. అటు కేరళ సీఏం కూడా తాము ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు. ఇక త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందనగా, బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ ప్రభుత్వం బ్రహ్మాస్త్రంలా తీసుకువచ్చింది.