Virat Kohli: టీ20 వరల్డ్ కప్.. విరాట్ కోహ్లీ విషయంలో కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ..!
- విరాట్ కోహ్లీని తప్పించి యువ ఆటగాళ్లకు చోటు కల్పించే యోచనలో బీసీసీఐ
- కోహ్లీ బ్యాటింగ్ శైలి విండీస్ స్లో పిచ్‌లకు సెట్ కాదని క్రికెట్ బోర్డు భావన
- పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేని బీసీసీఐ
- విరాట్ కోహ్లీకి సర్దిచెప్పే బాధ్యత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కి అప్పగింత
- ఐపీఎల్‌లో రాణిస్తే మాత్రం కోహ్లీకి ప్రపంచకప్‌లో పక్కా ఛాన్స్
- జూన్ 5న కెనడాతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా
2024 టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రన్ మెషిన్ విరాట్ కోహ్లీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వరల్డ్ కప్ జట్టు నుంచి విరాట్‌ను తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ బ్యాటింగ్ శైలి విండీస్‌లోని స్లో పిచ్‌లకు సెట్ కాదని భారత క్రికెట్ బోర్డు భావిస్తోందట. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేయాలనే భావనలో ఉందట. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ ప్రదర్శన పట్ల బీసీసీఐ సంతృప్తిగా కూడా లేదు. అందుకే అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది.
ఇక ప్రపంచకప్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేలా విరాట్ కోహ్లీకి సర్దిచెప్పే బాధ్యతను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కి అప్పజెప్పినట్లు సమాచారం. కోహ్లీ కంటే ఈ ఫార్మాట్‌లో యువ ప్లేయర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే తదితరులు ఇంకా బాగా ఆడగలరని బోర్డు పెద్దలు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ కోహ్లీని తప్పిస్తే మాత్రం భారత క్రికెట్‌లో అలజడి రేగడం ఖాయం. అయితే, విరాట్ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు బీసీసీఐ ఇంత పెద్ద సాహసం తీసుకునే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక ప్రపంచకప్‌కు ముందు జరిగే ఐపీఎల్‌లో కోహ్లీ సత్తా చాటితే మాత్రం తప్పనిసరిగా వరల్డ్‌కప్ లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఐసీసీకి టీ20 వరల్డ్ కప్‌లో ఆడే 15 మందితో కూడిన జట్టు వివరాలను మే మొదటి వారం వరకు పంపించాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో టీమిండియా.. పాకిస్థాన్, అమెరికా, కెనడాలతో కలిపి గ్రూపు-ఏలో ఉంది. అలాగే భారత్ తన మొదటి మ్యాచ్ జూన్ 5న కెనడాతో ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడాతో ఆడుతుంది.