IPL 2024: హార్దిక్ పాండ్యా లేకున్నా గుజరాత్ టైటాన్స్ మెరుగ్గానే ఉంది.. పెద్ద నష్టం కూడా లేదు: బ్రాడ్ హాగ్
- మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం
- హార్ధిక్ పాండ్యా లేకున్నా గుజరాత్‌కు పెద్ద ఇబ్బందేమీ లేదన్న బ్రాడ్ హాగ్
- హార్ధిక్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి సరిపోడన్న ఆస్ట్రేలియన్ క్రికెటర్
- ముంబై లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పాండ్యా బ్యాటింగ్ చేయాలని సూచన
మరో 10 రోజుల్లో (మార్చి 22వ తేదీ నుంచి) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమైన ఈ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తాజాగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి, ముంబై ఇండియన్స్‌తో కలవడంపై తనదైన శైలిలో స్పందించాడు. 2024లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకున్నా గుజరాత్ టైటాన్స్ మెరుగ్గానే ఉందని ఈ ఆస్ట్రేలియన్ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.
పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ 2022లో టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే 2023లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఐపీఎల్ 2024కి ముందు అతను ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకి సరైన ప్రత్యామ్నాయం దొరకడం లేదని గుజరాత్ గురించి ఆందోళనలు తలెత్తగా, ఈ విషయమై హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యా నిజంగా గుజరాత్‌కి అంత పెద్ద నష్టం అని నేను అనుకోను. అతను మిడిల్ ఆర్డర్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్. కానీ, వారు దానిని కవర్ చేయగలరు. గుజరాత్ టైటాన్స్ మంచి బౌలింగ్ డెప్త్‌ని కలిగి ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేదు. ఇక హార్దిక్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, అతను అక్కడ బాగా సరిపోతాడని నేను అనుకోను. కాబట్టి అతను లేకుండా గుజరాత్ టైటాన్స్ మెరుగ్గా ఉంది" అని హాగ్ చెప్పాడు.
"ముంబై లోయర్ మిడిల్ ఆర్డర్‌లో భారత ఆల్ రౌండర్ బ్యాటింగ్ చేయడం మంచిది. హార్దిక్ ఇక్కడే బ్యాటింగ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. హార్దిక్ అత్యుత్తమ ప్రదర్శనతో తిరిగి ముంబై ఇండియన్స్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతాడని నేను భావిస్తున్నాను" అని హాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇప్పటికే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు. ఐదుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్రోఫీని అందించిన సారథి రోహిత్ శర్మ స్థానంలో ముంబైకి కెప్టెన్‌గా పాండ్యా సిద్ధమయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు ముంబై జట్టు ఆడే ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.