Pak Women CAA: స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ సీఏఏ అమలును స్వాగతించిన సీమా హైదర్.. వీడియో ఇదిగో!

Pak Woman Seema Haider Welcomes CAA

  • ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం  
  • ఈ చట్టంతో తనకు భారత పౌరసత్వం వస్తుందని ఆశాభావం
  • యూపీ యువకుడి కోసం పిల్లలు సహా ఇండియాకు వచ్చేసిన పాకిస్థానీ మహిళ సీమా

ప్రియుడి కోసం నలుగురు పిల్లలు సహా ఉత్తరప్రదేశ్ వచ్చేసిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుపై సీమా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీమా స్పందించారు. ఈ చట్టం అమలును స్వాగతించిన సీమా.. సీఏఏతో తనకు భారత పౌరసత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈమేరకు సోమవారం రాత్రి సీమా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తన నలుగురు పిల్లలు, భర్త (యూపీ యువకుడు)తో కలిసి సీఏఏ చట్టం అమలుపై మాట్లాడారు.

‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిందే చేసి చూపించారు. సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషం అనిపించింది. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని నమ్ముతున్నా’ అంటూ సీమా హైదర్ ఈ వీడియోలో చెప్పారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలకు జై కొడుతూ నినాదాలు చేశారు. సీఏఏ అమలును స్వాగతిస్తూ కుటుంబంతో కలిసి స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.

కాగా, యూపీ యువకుడిని పెళ్లాడేందుకు తాను హిందూ మతంలోకి మారానని, సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నానని సీమా హైదర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై తనది భారత దేశమేనని, పాకిస్థాన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని సీమా తేల్చిచెప్పారు. భర్త, నలుగురు పిల్లలతో కలిసి సీమా ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తోంది. 

Pak Women CAA
Seema Haider
CAA Notification
Seema CAA
UP man Pak women
Viral Videos

More Telugu News