BWF: సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీ ఖాతాలో సీజన్ తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్
- ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్లు
- 21-13, 21-16 తేడాతో 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన టాప్ జోడి
- పారిస్-2024 ఒలింపిక్స్‌కు ముందు సానుకూల విజయాన్ని సాధించిన జంట
బీడబ్ల్యూఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) 2024 సీజన్‌ను భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ విజయంతో ప్రారంభించారు. ఈ జంట ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన లీ జే-హువే-యాంగ్ పో-హ్సువాన్ జోడీపై 21-13, 21-16 తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించిన సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీ కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ని ముగించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేషియా మాస్టర్స్ (సూపర్ 1000), ఇండియన్ ఓపెన్ (సూపర్ 750) ఫైనల్స్‌లో ఈ జంట ఓడిపోయినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలవడం శుభపరిణామంగా మారింది.
కాగా సాత్విక్-చిరాగ్ జోడికి ఇది 7వ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ని గెలవడం రెండవసారి. 2019లో కూడా వీరిద్దరూ ఈ టైటిల్‌ని గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్ 2024 విజయంపై చిరాగ్ స్పందిస్తూ.. ఈ గెలుపు చాలా సంతోషాన్ని ఇస్తోందని అన్నాడు. పారిస్ ఒలింపిక్స్ తమకు ప్రత్యేకమైనదని, ఒలింపిక్స్ ఆరంభానికి కొన్ని నెలల సమయం ఉందని ప్రస్తావించాడు. వచ్చే వారం మరో టోర్నమెంట్ ఉందని, దాని కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు. ఇక సాత్విక్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి చాలా కాలం అయ్యిందని విజయాన్ని ఉద్దేశించి అన్నాడు. తాము 100 శాతం ప్రదర్శన చేశామని అన్నాడు.
బీడబ్ల్యూఎఫ్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 విజేతలు వీరే:
1. పురుషుల సింగిల్స్ - షి యు క్వి (చైనా)
2. మహిళల సింగిల్స్ - యాన్ సి యంగ్ (దక్షిణ కొరియా)
3. పురుషుల డబుల్స్ - సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి (భారత్)
4. మహిళల డబుల్స్ - చెన్ క్వింగ్ చెన్-జియా యి ఫ్యాన్ (చైనా)
5. మిక్స్‌డ్ డబుల్స్ - ఫెంగ్ యాన్ జె-హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా).