Rahul Dravid: టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ద్రావిడ్
- ఒక్కోసారి కష్టంగా అనిపించినా టెస్ట్ క్రికెట్ గొప్ప సంతృప్తిని ఇస్తుందన్న టీమిండియా ప్రధాన కోచ్
- తొలి మ్యాచ్ ఓడిపోయి తర్వాత 4 మ్యాచ్‌లు గెలవడం అద్భుతమన్న ద్రావిడ్
- ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో యువ క్రికెటర్లతో మాట్లాడిన ద్రావిడ్
టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌కు ఆదరణ పెంచడంపై బీసీసీఐ దృష్టిసారించిన వేళ టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది కానీ ఆటగాడికి గొప్ప సంతృప్తినిస్తుందని అన్నాడు. ఇంగ్లండ్‌పై ఇండియా 4-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో యువ క్రికెటర్లకు పలు సూచనలు ఇచ్చే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఇలాంటి సిరీస్‌లు గెలివాలి. కానీ చాలా సంక్లిష్టమైనది. టెస్ట్ క్రికెట్ ఆడడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. నైపుణ్యాలపరంగా, శారీరకంగా, మానసికంగా కష్టంతో కూడుకున్నది. మీరంతా చూస్తూనే ఉన్నారు. కానీ సిరీస్ ముగింపులో గొప్ప సంతృప్తి కలుగుతుంది. తొలి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత 4 మ్యాచ్‌లను గెలిచిన ఇలాంటి సిరీస్‌ను ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇది అసాధారణమైన విజయంగా నేను భావిస్తున్నాను’’ అని ద్రావిడ్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ షేర్ చేసింది.
ఇతరుల గెలుపులలో కూడా సాయపడాల్సి ఉంటుందని యువ క్రికెటర్లకు రాహుల్ ద్రావిడ్ సూచించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు ఒకరినొకరు విజయవంతం చేయాల్సిన అవసరం ఉంటుందన్నాడు. బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ అయినా ఇతరుల విజయంతో వ్యక్తిగత విజయాలు ముడిపడి ఉంటాయని తెలుసుకోవాలని సూచించాడు. ఒకరి విజయానికి మరొకరు సహకరిస్తూ ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని రాహుల్ ద్రావిడ్ అన్నాడు.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌పై భారత్ 4-1తో చారిత్రాత్మక రీతిలో టెస్ట్ సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి ఆ తర్వాత 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడం 112 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెద్దగా స్టార్ ప్లేయర్లు లేకుండానే ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆకాశ్ దీప్ యువ క్రికెటర్లు ఆకట్టుకున్నారు.