MLC Kavitha: కాంగ్రెస్ సభ వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS Mlc Kavitha Tweet On Power Cuts

  • సాక్షాత్తూ అసెంబ్లీలోనే కరెంట్ కట్ అయిందని వ్యంగ్యం
  • అధికార పార్టీ మీటింగ్ లోనూ అదే పరిస్థితని వివరణ
  • రైతుల గోసపై దృష్టి పెట్టాలని సీఎంకు చెప్పాలంటూ జీవన్ రెడ్డికి విజ్ఞప్తి

తెలంగాణ రైతుల కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరెంట్ కోతలతో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారిక సభకు సంబంధించిన ఓ వీడియోను కవిత ఆదివారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓ సభలో పాల్గొన్నారు. సభ జరుగుతుండగా కరెంట్ పోవడంతో అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో పవర్ కట్.. అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. అంటూ కవిత ట్వీట్ చేశారు. జీవన్ రెడ్డి ఓ పేపర్ తో గాలి విసురుకుంటున్న వీడియోను షేర్ చేశారు. కాసేపు కరెంట్ పోతేనే ఇంతగా అల్లాడిపోతున్నారు.

మీరే స్వయంగా ఫోన్‌ చేసినా కూడా కరెంటు రాలేదు. దీంతో మీకు ఎంత ఇబ్బంది కలిగిందో కనిపిస్తూనే ఉంది. మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇంకెంత ఇబ్బంది కలుగుతుందో మీకు అర్థమవుతోందా.. అంటూ జీవన్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని, అది చూసి రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరైనా కరెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పండంటూ కవిత ట్వీట్ చేశారు. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందని మండిపడ్డారు. ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపైనా పెట్టాలని సీఎంకు సూచించాలని కోరారు.

MLC Kavitha
Power cuts
Jeevan Reddy
Congress
Assembly
Telangana

More Telugu News