Rhino chase: టూరిస్టుల వాహనం వెంటపడి తరిమిన రైనో.. అస్సాం నేషనల్ పార్క్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Rhino chases safari vehicle in Assams Manas National Park

  • ఒకటిన్నర కిలోమీటర్లు తరిమిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఎప్పుడు జరిగిందనే విషయంపై కొరవడిన స్పష్టత

అడవి జంతువులను చూడాలని సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటకులకు ఓ రైనో (ఖడ్గమృగం) చుక్కలు చూపించింది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేసింది. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల పాటు వెంటపడి తరిమింది. అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్ లో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అటవీ శాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. మానస్ నేషనల్ పార్క్ లో సఫారీ రైడ్ కు వెళ్లిన కొంతమంది పర్యాటకులకు ఈ అనుభవం ఎదురైంది.

జీప్ లో వెళుతుండగా రైనో కనిపించడంతో పర్యాటకులు ఫొటోలు దిగుతూ గోల చేశారు. ప్రశాంతంగా గడ్డి తింటుంటే వీళ్ల గోల ఏంటని అనుకుందో ఏమో కానీ ఒక్కసారిగా జీప్ వైపు పరిగెత్తుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. జీపును ముందుకు కదిలించాడు. బెదిరించి వదిలిపెట్టకుండా ఖడ్గమృగం వెంటపడింది. జీప్ వెనకాలే పరిగెత్తుతూ వచ్చింది. ఎంతదూరమైనా ఇలాగే వెంటపడేలా ఉందని భావించిన డ్రైవర్.. వేగం పెంచడంతో కాసేపటికి రైనో ఆగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News