Andhra Pradesh: ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్

Joint statement from three parties

  • ఏపీలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు
  • బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన
  • బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకటన  

త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులు అమిత్  షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల చర్చలు ముగిశాయి. ఏపీలో మూడు పార్టీల పొత్తు, ఎన్డీయేలోకి టీడీపీ, జనసేన చేరికపై జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చేయి కలిపాయని ఆ ప్రకటనలో వెల్లడించారు. దేశ సౌభాగ్యం, ఏపీ ప్రజల అభ్యున్నతే ఈ మూడు పార్టీల లక్ష్యం అని వివరించారు. 

"బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. గత పదేళ్లుగా భారతదేశ పురోభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలతో భాగస్వామ్యం ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో దోహదపడుతుంది. బీజేపీ, టీడీపీ మధ్య చాలా పాత స్నేహం ఉంది. టీడీపీ 1996లో ఎన్డీయేలో చేరింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలోనూ, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనూ విజయవంతంగా కలిసి పనిచేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మద్దతు పలికింది. ఇక, మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం మార్గదర్శకాలు, ఇతర వివరాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుంది. మా కూటమి ఏపీ ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రజలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం" అని ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

 జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల తరఫున బీజేపీ కేంద్ర కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News