Sachin Tendulkar: అండర్సన్ 700 వికెట్ల ఘనతపై సచిన్ ఏమన్నారంటే..!
- 2002లో అండర్సన్ ఆటను మొదటిసారి చూశానన్న సచిన్
- బంతిపై అతడి నియంత్రణ ప్రత్యేకంగా కనిపించిందని కితాబు
- అండర్సన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ ప్రశంస
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ మీడియం పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల మార్క్‌తో చరిత్ర సృష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచారు. టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడంతో అండర్సన్ ఈ ఫీట్‌ను సాధించారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్ (800), షేన్ వార్న్ (708) తర్వాత అండర్సన్ మూడో స్థానంలో ఉన్నారు.
ఇక జేమ్స్ అండర్సన్ సాధించిన ఈ అరుదైన ఘనతపై భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా జిమ్మీపై లిటిల్ మాస్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. '2002లో ఆస్ట్రేలియాలో అండర్సన్ ఆటను నేను మొదటిసారి చూశా. బంతిపై అతడి నియంత్రణ ప్రత్యేకంగా కనిపించింది. ఆ సమయంలో నాసిర్ హుస్సేన్ అండర్సన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక ఫాస్ట్ బౌలర్ 22 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడుతూ 700 వికెట్ల మైలురాయిని చేరుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అండర్సన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇది నిజంగా అద్భుతమే' అని సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.