Lu Jingang: టూరిస్ట్ స్పాట్‌లో బిచ్చగాడిగా నటిస్తూ.. నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న చైనా నటుడు!

Chinese Actor Lu Jingang Earns Rs 8 Lakh A Month By Begging At Tourist Spot

  • యాచిస్తూ ఏడాదికి కోటి రూపాయ‌లు వెన‌క్కి వేస్తున్న ప్రొఫెషనల్ నటుడు లూ జింగాంగ్
  • హెనాన్ ప్రావిన్స్‌లోని క్వింగ్మింగ్ షాంగే గార్డెన్‌లో గత 12 ఏళ్లుగా భిక్షాటన
  • అద్భుత‌మైన న‌ట‌నా నైపుణ్యాలే అత‌ని ఈ జీవనోపాధికి మార్గం    
  • చైనాలోని అత్యంత సంపన్న బిచ్చగాళ్లలో ఒకడిగా లూ

ఓ చైనా న‌టుడు యాచిస్తూ నెల‌కు రూ.8 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఇలా ఏడాదికి దాదాపు రూ.కోటి ఆర్జిస్తున్నాడు. అత‌ని పేరు లూ జింగాంగ్. ప్రొఫెషనల్ చైనీస్ నటుడు. అయితే, అత‌నికి న‌ట‌న రంగంలో సరైన అవ‌కాశాలు రాలేదు. దాంతో బ‌తుకుదెరువు కోసం త‌న న‌ట‌నా నైపుణ్యాల‌ను మ‌రో విధంగా ఉప‌యోగించాడు. త‌న యాక్టింగ్ స్కిల్స్‌ను ఉప‌యోగించి భిక్షాట‌న చేయ‌డం మొద‌లెట్టాడు. బాగా జనాదరణ పొందిన, ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో యాచిస్తూ ఇప్పుడు నెల‌కు రూ.8 లక్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడు. ఇక లూ జింగాంగ్‌ను బిచ్చగాడి వేషంలో చూస్తే ఎవ‌రికైనా అత‌నిపై జాలి కలుగుతుంద‌ట‌. అయ్యో పాపం.. అంటూ జేబులోంచి చిల్ల‌ర తీసి వేసేస్తుంటార‌ట ఆ ప్ర‌దేశానికి వ‌చ్చేవారు. దీనికి కార‌ణం అతని అద్భుతమైన నటనా నైపుణ్యాలే. ఆ యాక్టింగ్ స్కిల్సే ఇప్పుడు అత‌ని జీవనోపాధిని సంపాదించడంలో ప‌డుతున్నాయ‌న్న‌మాట‌.

ఒక ప్రొఫెషనల్ నటుడయిన లూ గత 12 ఏళ్లుగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని క్వింగ్మింగ్ షాంగే గార్డెన్ సుందరమైన ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇంటి నుంచి వ‌చ్చేట‌ప్పుడు మంచి బట్ట‌ల్లోనే అక్క‌డికి వ‌స్తాడ‌ట‌. అక్క‌డికి వ‌చ్చిన‌ త‌ర్వాత‌ చిరిగిపోయిన దుస్తులు వేసుకుని, ముఖానికి న‌ల్ల‌టి మ‌సిని రాసుకుంటాడు. అనంత‌రం త‌న న‌ట‌నా నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తాడు. ముఖాన్ని ఎప్పుడూ విచారంగా కనిపించేలా ఉంచ‌డంతో పాటు అప్ప‌డ‌ప్పుడు ఏడుపును కూడా న‌టిస్తాడ‌ట‌. అంతే.. పర్యాటకులు లూని ఆ పరిస్థితిలో చూసి జాలిపడి తమ‌ జేబుల్లోంచి చిల్ల‌ర తీసి వేస్తుంటార‌ట‌. 

ఇలా లూ నెలకు 70,000 యువాన్ల (సుమారు రూ. 8 లక్షలు) వరకు సంపాదిస్తున్నాడు. అలాగే కొంద‌రు ఆహారం, పానీయాలు కూడా ఇస్తార‌ట‌. దాంతోనే పొట్ట నింపుకునే లూ.. సంపాద‌న మొత్తం అలాగే దాచిపెడుతున్న‌ట్లు తెలిసింది. ఇక‌ నివేదికల ప్రకారం చైనాలో అత్యధిక జీతం దాదాపు 29,000 యువాన్లు (సుమారు రూ. 3 లక్షలు). కానీ, లూ నెల‌వారీ సంపాద‌న రూ.8ల‌క్ష‌లు. ఇది చైనాలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులలో లూ జింగాంగ్‌ను ఒకరిగా చేసింది. కొన్ని నివేదికలు అతను చైనాలోని అత్యంత సంపన్న బిచ్చగాళ్లలో ఒకడని పేర్కొన్నాయి.

More Telugu News