Team India: ధర్మశాల టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట... భారత్ ఆధిక్యం 255 రన్స్
- ధర్మశాలలో టీమిండియా, ఇంగ్లండ్ ఐదో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్
- రెండో రోజు ఆట చివరికి 8 వికెట్లకు 473 రన్స్ చేసిన భారత్
ధర్మశాలలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (27 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 9వ వికెట్ కు అజేయంగా 45 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులు.
అంతకుముందు, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ కావడం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 135/1తో ఇవాళ ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుభ్ మాన్ గిల్ (110) సెంచరీలు సాధించడం రెండో రోజు ఆటలో హైలైట్ గా నిలిచింది.
కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న దేవదత్ పడిక్కల్ (65) అర్ధసెంచరీతో మెరిశాడు. పడిక్కల్ 10 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. సర్ఫరాజ్ ఖాన్ 60 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లతో విజృంభించడంతో టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జడేజా 15, ధ్రువ్ జురెల్ 15 పరుగులు చేశారు.
కుల్దీప్ యాదవ్, బుమ్రా జోడీ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. వీరిద్దరూ పట్టుదలగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్ లే 2, జేమ్స్ ఆండర్సన్ 1, కెప్టెన్ బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు. కాగా, ఇంగ్లండ్ ప్రధాన పేసర్ ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయికి ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.