Nara Bhuvaneswari: 'కలలకు రెక్కలు' పథకాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరి
- కర్నూలు జిల్లా పత్తికొండలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
- మొదటిసారి ఓటు వేయనున్న యువతీయువకులతో ముఖాముఖి
- పత్తికొండలో కొత్త కార్యక్రమం ప్రకటన
- మహిళలు, విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' పథకం
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. ఇవాళ ఆమె పత్తికొండలో పర్యటించారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతీయువకులతో ముఖాముఖి నిర్వహించారు.
ఓటు ఎవరికి వేయాలో ముందే ఆలోచించుకోవాలని యువతకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె 'కలలకు రెక్కలు' పథకాన్ని ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 'కలలకు రెక్కలు' పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. మహిళలు, ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం తీసుకువస్తున్నట్టు భువనేశ్వరి వివరించారు.
ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తారని తెలిపారు. బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా ఈ 'కలలకు రెక్కలు' పథకానికి రూపకల్పన చేశారని వెల్లడించారు.