Mohammed Shami: రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఎంట్రీ..?
![Mohammed Shami To Join BJP Ahead Of Lok Sabha Polls 2024](https://imgd.ap7am.com/thumbnail/cr-20240308tn65ea8c83d1f96.jpg)
- మహ్మద్ షమీ కోసం బీజేపీ ప్రయత్నాలు
- బెంగాల్‌లోని బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం
- ఇప్పటికే బెంగాల్ రాజకీయాల్లో మనోజ్ తివారీ, అశోక్ దిండా
స్వదేశంలో గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే, ఇదే టోర్నీలో గాయపడిన షమీ ఆ తర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం అతని గురించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. షమీ రాజకీయాల్లోకి రాబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. బీజేపీ నేతలు షమీతో ఒకసారి చర్చలు కూడా జరిపారని, వారి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
అన్నీ కుదిరితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట. ఇక బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదేమీ కొత్తకాదు. మహ్మద్ షమీ కంటే ముందే ఇద్దరు భారత ఆటగాళ్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వారే మనోజ్ తివారీ, అశోక్ దిండా. మనోజ్ తివారీ తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం యువజన, క్రీడాశాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.